దేశంలో వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా జీవనోపాధి కల్పిస్తున్న రంగం చేనేత . కానీ లాక్ డౌన్ చేనేత కార్మికుల బతుకులను దుర్భరంగా మార్చేసింది. చేద్దామంటే పనిలేదు... చేసిన పనికి కూలీ రాదు. చేతితో అందమైన చీరలు తయారు చేసే చేనేత కుటుంబాలు పనులు లేక రోడ్డెక్కాయి.
గత రెండు నెలలుగా వారు తయారు చేసే... చీరలు అమ్ముకునేందుకు మార్కెటింగ్ అవకాశం లేకపోవడం.. జీవితాలను మరింత చిన్నాభిన్నం చేస్తోంది. మాస్టర్ వీవర్స్ కార్మికులు నేసిన చీరలు ఇళ్లలోనే ఉంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
16 కోట్ల జరీ చీరలు
జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలలో 16 కోట్ల విలువైన జరీ చీరలు ఉన్నట్లు జౌలి శాఖ అధికారులు అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో ఒక్క గద్వాల్ జిల్లాలోనే 14 కోట్ల విలువైన జరీ చీరలు ఉన్నాయి. పై రెండు జిల్లాల పరిధిలో 2500లకు పైగా జియో ట్యాగింగ్ కలిగిన మగ్గాలు ఉన్నాయి. వీటిపై నెలకు 8వేలకు పైగా చీరలు నేస్తారు. ఈ చీరలు అమ్ముుకునేందుకు ముంబయి, పూణే, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా తదితర నగరాలకు వెళ్తుంటారు.
లాక్‌డౌన్ కారణంగా మార్కెటింగ్ అవకాశాలు లేక ఒక్కో వీవర్ దగ్గర లక్షల రూపాయల విలువైన చీరలు ఉండిపోయాయి. ఫలితంగా పనులు ఆగిపోయి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మగ్గం మీద చేతులు ఆడితే గానీ... తమ నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్తాయి... తీరా మగ్గం ఆగిపోవడం.. తమ కడుపులు మాడ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. రోజు పనిచ్చే మాస్టర్ వీవర్ దగ్గర ఉన్న చీరలు అమ్ముడు పోక పోవడం వల్ల కార్మికులకు పని ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రభుత్వమే ఎలాగైన వాటిని కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: ముగ్గురు లష్కరే తోయిబా తీవ్రవాదులు అరెస్టు