కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకునే రాష్ట్రం.. కరోనా టెస్టులు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అరుణ పేర్కొన్నారు. తమిళనాడులో 5 లక్షలు, మహారాష్ట్రలో 4 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తే, తెలంగాణలో చేసిన టెస్టులు 40 వేలు మాత్రమే అని ఆమె మండిపడ్డారు.
దేశంలోనే కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవని.. వైద్య సిబ్బందికి సరిపడా పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. మంత్రి ఈటల చెబుతున్న 10 లక్షల పీపీఈ కిట్లు ఎటు పోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భాజపా కార్యాలయంలో నూతనంగా ఎన్నుకున్న జిల్లా కార్యవర్గ సభ్యులకు పత్రాలను అందజేశారు.