Gadwal Forts: గద్వాల సంస్థానం మహబూబ్‌నగర్ జిల్లాకు కీర్తి పతాకంగా నిలిచిన ప్రదేశం. నాటి ఘనకీర్తికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఎన్నో చారిత్రక ఆనవాళ్లు ఈ ప్రదేశంలో నేటికీ ఉన్నాయి. గద్వాల పట్టణం నడిబొడ్డులో ఉన్న సోమనాద్రికోట ఎత్తైన పెద్ద పెద్ద బురుజులతో మట్టితో నిర్మించబడింది. నాటి చరిత్రకు అద్దం పట్టే ఆ కట్టడాలు ప్రస్తుతం స్థానికుల పాలిట శాపంగా మారింది. సోమనాద్రి కోట బరుజును ఆనుకొని ఉన్న సోమనాద్రినగర్ కాలనీలో 420 కుటుంబాలు నివసిస్తున్నాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన... కట్టడాలు పూర్తిగా శిథిలావస్థకు చేరటంతో.... ప్రస్తుతం ప్రమాదకరంగా మారాయి. దీంతో వర్షాకాలం వచ్చిందంటే కాలనీ వాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కోటబురుజులు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితిలో ప్రజలను పునరావాసాలకు తరలించటం ఏటా ఆనవాయితీగా మారింది.
వారంరోజులుగా కురిసిన వర్షాలతో సోమనాద్రి కోట బురుజు గోడలు నానిపోయాయి. శిథిలావస్థకు చేరటంతో ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెండు చోట్ల నేలకూలటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే.... పట్టణంలోని 30,37 వార్డులకు చెందిన సోమనాద్రినగర్ కాలనీకి చెందిన ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్నారు. వానలు తగ్గాక... మళ్లీ వారి వస్తువులతో ఇళ్లకు పంపిస్తారు. ఏటా వర్షాకాలం రాగానే ఇళ్లను వదిలిపెట్టి పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పునరావాసాల్లో ఉండి అవస్థలు పడుతున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు.
వానాకాలం రాగానే ఇళ్లలో ఉంటే బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తుందని.... పునరావాసాలకు వెళ్తే దిక్కులేని వారిలా కష్టాలు పడుతున్నామని సోమనాద్రినగర్ కాలనీవాసులు వాపోతున్నారు. పాలకులు సమస్యకు శాశ్వత పరిష్కారంచూపుతామని ఏళ్ల తరబడిగా హామీలు ఇచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని చెబుతున్నారు. తమ గోడును పట్టించుకుని మరోచోట ఇళ్లు నిర్మించటం లేదంటే మరో విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: Road accident at menur: కంటైనర్ కిందకు దూసుకెళ్లిన ఆటో.. అక్కడికక్కడే ఆరుగురు మృతి