Farmers suffering from pests: ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌లో వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేస్తున్నందున రైతులు మొక్కజొన్న, శెనగ, వేరుసెనగ, మినుము, పెసర పంటలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. విపరీతమైన చలి, గాలిలో అధిక తేమ వల్ల ఆ పంటలపై పురుగుల దాడి ఉద్ధృతంగా ఉంది. ఇప్పటికే వేసిన పైర్లను పురుగులు, తెగుళ్లు తినేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 4 నుంచి 10 డిగ్రీలే ఉండడంతో పురుగులు పెరుగుతున్నట్లు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయశాఖల అధ్యయనంలో వెల్లడైంది. వీటి నివారణకు రైతులు తక్షణం జాగ్రత్తలు తీసుకోకపోతే పూత, కాత దెబ్బతిని దిగుబడులు తగ్గే ప్రమాదముందని హెచ్చరించింది. అధ్యయనంలో గుర్తించిన అంశాలను విశ్వవిద్యాలయం వెల్లడించింది. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.
- వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పూత దశలో ఉన్న మొక్కజొన్న పైరులో కత్తెర పురుగు ఉన్నట్లు స్థానిక వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇది మక్క ఆకులు, కంకులను పూర్తిగా తినేస్తుంది. దీని నివారణకు విషపు ఎరలు ఏర్పాటుచేయాలి. 10 కిలోల వరి తౌడుకు 2 కిలోల చొప్పున బెల్లం, 2 నుంచి 3 లీటర్ల చొప్పున నీటిని కలిపి 12 గంటలపాటు పులియబెట్టాలి. దానికి 100 గ్రాముల థైడికార్బ్‌ను కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్కజొన్న చెట్టు సుడులలో వేస్తే ఈ పురుగుల ఉద్ధృతి తగ్గుతుందని జయశంకర్ వర్సిటీ సూచించింది.
- వేరుసెనగ పంటలో జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో టిక్కా ఆకుమచ్చ తెగులు, ఇతర ప్రాంతాల్లో పొగాకు లద్దెపురుగు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లద్దెపురుగు నివారణకు లీటరు నీటికి 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రనిలిప్రోల్ చొప్పున కలిపి చల్లాలి.
- జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో శనగలో పచ్చపురుగు, ఎండుతెగులు వంటివి కనిపిస్తున్నాయి. దీని నివారణకు రసాయన పురుగు మందులను చల్లడం కన్నా ఎకరాకి 10 నుంచి 15 చోట్ల పక్షి స్థావరాలను ఏర్పాటుచేస్తే పక్షులు పురుగు లార్వాలను తినేసి మేలు చేస్తాయి. పురుగు గుడ్లు, తొలిదశ లార్వాల నియంత్రణకు 5 శాతం వేప గింజల కషాయాన్ని పైరుపై చల్లాలి.
- కూరగాయల పంటలకు కూడా తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంది. చిక్కుడుకాయల్లో పురుగులు చేరి గింజల్ని తినేస్తున్నాయి. వంగ, టమాటాలపై తెగుళ్ల కారణంగా మచ్చలు అధికమై మార్కెట్‌లో ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. కూరగాయలు నేలపై పడకుండా పందిళ్లు, కర్రలు ఏర్పాటు చేస్తే మంచిదని ఉద్యానశాఖ తెలిపింది.
- వంగతోటల్లో కొమ్మ, కాయతొలుచు పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున ప్రొఫెనోఫాస్ కలిపి చల్లాలి.
- మిరపతోటల్లో ప్రస్తుత వాతావరణంలో తామర పురుగుతో పాటు బ్యాక్టీరియా ఆకుమచ్చ, కోయినోపొర కొమ్మకుళ్లు తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. లీటరు నీటికి 2 మి.లీ. పిప్రోనిల్ మందును కలిపి చల్లాలి.
- బత్తాయిలో కాయపై మంగును కలిగించే నల్లిపురుగుతో, పూత కాత రాలుతున్నాయి. నివారణకు చర్యలు తీసుకోవాలి.
వాతావరణమే ప్రధాన కారణం..
వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల తెగుళ్లు, పురుగుల బెడద ఎక్కువగా ఉంటోంది. లింగాకర్షక బుట్టలు ఏర్పాటుచేస్తే పురుగుల ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. అధిక రసాయనాలను చల్లడం వల్ల మిత్ర పురుగులు నశించి తెగుళ్లు పెరుగుతున్నాయి. వీటిని గుర్తిస్తే సమీపంలోని వ్యవసాయ, ఉద్యాన అధికారులు లేదా కృషి విజ్ఞాన కేంద్రంలో సంప్రదించి నివారణ చర్యలు తీసుకోవాలి. దుకాణాల్లో వ్యాపారులు అరకొర జ్ఞానంతో చెప్పే మందులను రైతులు పంటలపై చల్లవద్దు. -డాక్టర్ జగదీశ్వర్, పరిశోధనా సంచాలకుడు, జయశంకర్ వర్సిటీ
ఇదీ చదవండి: rape on student in shamirpet : 9వ తరగతి విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు అత్యాాచారం