జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దర్శించుకున్నారు. భాజపా జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యక్షురాలిగా నియమించడం వల్ల హైదరాబాద్ నుంచి బయలుదేరి.. ముందుగా బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
అలంపూర్ పట్టణంలో కార్యకర్తలు డీకే అరుణకు స్వాగతం పలికారు. జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న డీకే అరుణ... అర్చకుల ఆశీర్వాదం పొందారు.
అమ్మవారి ఆశీర్వాదం వల్లే తనకు ఈ పదవి వచ్చిందని ఆమె తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలోపేతం చేస్తామని అన్నారు.
నవంబరులో తుంగభద్రా నదికి పుష్కరాలు ఉన్నాయని ఇంతవరకు ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తుంగభద్ర పుష్కరాలపై పనులు ప్రారంభించిందని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై ఎటువంటి సమావేశాలు కూడా నిర్వహించలేదని.. ఈ ప్రాంతం అంటే ఎందుకంత నిర్లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణలో తుంగభద్రా నది సమీపంలో వెలసిన దివ్య క్షేత్రం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఈ చిన్న ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకపోతే అమ్మ వారి ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తుంగభద్ర పుష్కర పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.