హోం క్వారంటైన్‌లో ఉన్నవారి ఆరోగ్య స్థితిగతులపై వైద్య బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా ఆదేశించారు. బుధవారం ఇన్‌ఛార్జి ఎస్పీ అపూర్వారావుతో కలిసి కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల అధికారులతో కలెక్టర్ దృశ్య మాధ్యమంలో మాట్లాడారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో హోం క్వారంటైన్‌లో ఎంత మంది ఉన్నారనే జాబితాను అధికారులు సరిపోల్చుకోవాలన్నారు.
జిల్లాలో ప్రస్తుతం 1200 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని, వారంతా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటేనే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. మినహాయింపులు ఇచ్చిన పలు రంగాల్లో పని చేసేందుకు హోం క్వారంటైన్‌లో, కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్నవారు వెళ్లవద్దని సూచించారు. ఇందుకుగాను పోలీసుశాఖ ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. దీనివల్ల వీరు ఎక్కడికి వెళ్లేది తెలిసిపోతుందన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, శిక్షణ కలెక్టర్ శ్రీహర్ష, ఆర్డీవో రాములు, జిల్లా నోడల్ అధికారి డా.అమర్‌సింగ్ నాయక్, డా.శశికళ, డా.ఇర్షాద్ పాల్గొన్నారు.