గత 4 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా పాలనాధికారి శ్రుతి ఓజా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో వర్షాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు. అధికారులెవరూ అనుమతి లేకుండా వారు పనిచేసే ప్రాంతం నుంచి వెళ్లరాదని సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉండేలా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, వర్షాలు, ప్రమాద పరిస్థితులపై కంట్రోల్ రూం నంబర్ 08546- 274007కు ఫోన్ చేయొచ్చని తెలిపారు. జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ కీలక శాఖాధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బంది, ప్రజలకు సూచనలు చేయాలన్నారు. జిల్లాలో 580 చెరువులు, సాగునీటి కాలువలున్నాయని, వర్షాలతో ఎక్కడైనా తెగే అవకాశం ఉంటే వెంటనే జాగ్రతలు తీసుకోవాలని, ఇసుక బస్తాలతో ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు.
వాగులు ప్రవహించే రహదారుల వద్ద రాకపోకలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. బొంకూరు, పుల్లురు వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మిన్నిపాడు వద్ద రాకపోకలను నిలిపేయాలని కోరారు. గ్రామాలు, పట్టణాల్లో వానలతో పడిపోయే ఇళ్లను గుర్తించి వాటిలో ఉన్నవారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి వారికి ఏర్పాట్లు చేయాలన్నారు. నదుల పరివాహక ప్రాంతం, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీహర్ష, శ్రీనివాసరెడ్డి, అదనపు ఎస్పీ కృష్ణ, ఆర్డీవో రాములు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు రహీముద్దీన్, శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ సమత, అర్‌అండ్‌బీ డీఈ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.