Praja Sangrama Yatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 నియోజకవర్గాల పరిధిలో 105 గ్రామాల్లో కొనసాగనున్న యాత్రను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ అలంపూర్‌లో ప్రారంభించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో బండి సంజయ్ జోగులాంబ ఆలయానికి వెళ్లారు. అలంపూర్‌లోని జోగులాంబ ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు బండి సంజయ్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు.
అలంపూర్ చేరుకున్న తర్వాత అంబేడ్కర్ విగ్రహానికి సంజయ్ నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన తరుణ్ చుగ్...బంగారు తెలంగాణ పేరిట ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. బహిరంగ సభకు నాయకులతో పాటు పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు తరలివచ్చారు. జోగులాంబ నుంచి ఇమాన్‌పూర్ వరకు ఇవాళ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఇమాన్‌పూర్‌లో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. రాత్రి బండి సంజయ్ బస చేసే ప్రాంతానికి వెళ్లనున్న కిషన్ రెడ్డి.. అక్కడే శిబిరంలో వారితో కలిసి భోజనం చేయనున్నారు. పాదయాత్ర శిబిరంలోనే ఇవాళ రాత్రి బస చేయనున్న కిషన్ రెడ్డి.. శుక్రవారం ఉదయం సంజయ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు.
31 రోజులపాటు.. రెండో విడత పాదయాత్ర 31 రోజులపాటు కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో యాత్ర కొనసాగించి, మధ్యాహ్న సమయంలో పార్టీ రాష్ట్రస్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. మొత్తం 387 కి.మీ దూరం సాగే కార్యక్రమం.. మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముగుస్తుంది.
ఇవీ చదవండి: