Water levels in projects: రాష్ట్రంతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 98వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. ప్రాజెక్టులో నీటిమట్టం 1074.2అడుగులకు చేరుకుంది. భారీ ప్రవాహం నేపథ్యంలో ఎస్సారెస్పీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిజామాబాద్ జిల్లా కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దు వంతెనతో పాటు బాసర వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎల్లంపల్లి వద్ద గోదావరికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున... దిగువన పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లక్ష్మీ బ్యారేజీ 35 గేట్లు ఎత్తి అంతేస్ధాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీలో 10వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.... 10 గేట్లు ఎత్తి, దిగువకు వదలుతున్నారు. జయశంకర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వరద నీరు పోటెత్తింది. మేడిగడ్డ బ్యారేజీ 35 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటి విడుదల విడుదల చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద చేరుతోంది. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 770క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సింగీతం ప్రాజెక్ట్ లోకి 950 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. అంతే మొత్తంలో పై నుంచి పారుతోంది. జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తి నీటిమట్టానికి చేరుకుంది. వేములవాడలోని మూలవాగు , రుద్రంగి లో దుర్గమ్మ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో... అడుగు మేర మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
అసిఫాబాద్ జిల్లా అడ, వట్టివాగు, ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు, సాత్నాల, నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతుంది. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీ వరద దృష్ట్యా ప్రాజెక్టు 9గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 11వందల 83 అడుగులకు గానూ... ప్రస్తుతం 11వందల 78 అడుగులకు చేరింది. దిగువకు నీటిని విడుదల చేసే అవకాశమున్నందున... పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భైంసా గడ్డెన్నవాగుకు వరద పోటెత్తడంతో ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలుతున్నారు. వరద ఉద్ధృతికి గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు దిగువన ఉన్న వివేకానంద చౌక్, ఆటోనగర్, పద్మావతి కాలనీలు నీటమునగటంతో సహయక సిబ్బంది రంగంలోకి దిగారు. వర్షాలు, వరదలతో ఆదిలాబాద్ జిల్లా కుంటాల, పొచ్చెర, కనకాయి జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి సమీపంలోని బోగత జలపాతం పొంగి పొర్లుతోంది. కొండకోనలు దాటుతూ పరవళ్లు తొక్కుతున్న జలధారను చూసి ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు.
ఇవీ చదవండి:
రాష్ట్రంలో రె(యిన్)డ్ అలర్ట్... తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు..