kaleswaram third TMC: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం వరద కాల్వకు సమాంతరంగా మరో కాల్వ తవ్వేందుకు రామడుగు, గంగాధర, బోయిన్‌పల్లి మండలాల్లోని 12 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ మొదలైంది. కాళేశ్వరంతో భూగర్భజలాలు పెరగడంతో నిలదొక్కుకుంటున్నామన్న సంతోషం లేకుండా చేస్తున్నారని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త కాల్వ అవసరం లేకుండానే ప్రస్తుతం ఉన్న కాల్వ ద్వారా ఏడాది పొడవునా నీరు తీసుకెళ్లేందుకు అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇప్పుడున్న కాల్వలో కేవలం మూడు నాలుగు నెలలు మాత్రమే నీరు తరలిస్తారని ఆ తర్వాత వృథాగానే ఉంటుందని చెబుతున్నారు. ఆ కాల్వను వినియోగించుకోకుండా మరో 600 ఎకరాలు సేకరించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు భూములను త్యాగంచేశామని.. మరోసారి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
chada on kaleswaram: అదనపు టీఎంసీ కాల్వ పనులపై రాష్ట్రప్రభుత్వం పునరాలోచించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మార్కెట్ ధర ఎకరానికి 30 లక్షలు పలుకుతుంటే 9 లక్షలు ఇస్తామనటం సరికాదని సూచించారు. ప్రభుత్వ తీరును అడ్డుకునేందుకు పలు గ్రామాల్లో నిర్మాణాలు ముమ్మరంగా చేపడుతున్నారు.కోళ్ల ఫారాలు, ఇళ్లు, వ్యవసాయ బావుల తవ్వకాలు చేపట్టారు. ఐతే రైతులు భూ సేకరణను అడ్డుకునేందుకు నిర్మాణాలు చేపడుతున్నారా పరిహారం మరింత ఎక్కువ పెంచుకొనేందుకు చేస్తున్నారా అన్న విషయంపై చర్చ సాగుతోంది. ప్రస్తుతం కొత్తగా చేపట్టిన నిర్మాణాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా లేదా సర్వేకు ముందు ఉన్ననిర్మాణాలకు మాత్రమే పరిహారం చెల్లిస్తుందా అని ఉత్కంఠ కొనసాగుతోంది.