మహరాష్ట్ర వంటి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. లక్ష్మీ పంపుహౌస్ నుంచి నీటి ఎత్తిపోతల కొనసాగుతున్నప్పటికీ... మేడిగడ్డ నుంచి గేట్లను తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డకు ఎగువ ప్రాంతం నుంచి 71,300 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుంది. బ్యారేజీలో 35 గేట్లు ఎత్తి ఉండడంతో 76,600 క్యూ సెక్కుల నీటిని కిందకు వదిలారు. ప్రస్తుతం బ్యారేజిలో 9.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
లక్ష్మీ పంప్ హౌస్ నుంచి నీటిని సరస్వతి(అన్నారం) బ్యారేజీకి జలాలను ఎత్తిపోస్తున్నారు. పంప్ హౌస్లో తొమ్మిది మోటార్లతో 18 పంపుల ద్వారా గోదావరి జలాలను గ్రావిటీలోకి తరలిస్తున్నారు. 9 మోటర్లతో 19,800 క్యూసెక్కుల నీటిని అన్నారం బ్యారేజీకి ఎత్తిపోశారు. సరస్వతీ(అన్నారం) బ్యారేజీకి ఇన్ ఫ్లో 15,070 క్యూసెక్కులు. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 10.87 టీఎంసీలు కాగా... 9.35 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. సరస్వతీ పంప్ హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు కూడా కొనసాగుతున్నాయి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు