అన్నారం బ్యారేజ్ గేట్లు తెరిచినపుడు కష్టపడి పండిస్తున్న పంటలు నీటమునిగి.. ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ బాధను మొరపెట్టుకున్నా స్పందించడం లేదని వాపోయారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం, చండ్రుపల్లి గ్రామాలకు చెందిన రైతులు పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అన్నారం బ్యారేజ్ ప్రాంతంలో నియంత్రణ గది వద్ద నిరసన చేపట్టారు.
ఇంజనీర్ల సమాచారంతో మహదేవపూర్ సీఐ ఏ.నర్సయ్య, కాళేశ్వరం ఎస్సై నరహరి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఆందోళన చేపట్టరాదని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకవెళ్లాలని సూచించడంతో రైతులు తమ ఆందోళన విరమించుకున్నారు. ఈ విషయమై క్షేత్రస్థాయి ఇంజనీర్లు కాళేశ్వరం ఠాణాలో రైతులపై ఫిర్యాదు చేశారు.