తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్ టీమ్లు సంచరిస్తుండటంతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం గుత్తికోయిలగూడెంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరిహద్దుల్లోని అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ముకునూర్ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గుత్తికోయ తెగలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కాటారం డీఎస్పీ బోనాల కిషన్, మహదేవపూర్ సీఐ నర్సయ్య గుత్తికోయ పిల్లలు చదువుకునేందుకు తమ వంతు సాయం చేశారు. ఆ తెగకు చెందిన విద్యావంతుడైన ఓ యువకుడితో చిన్నారులకు చదువు చెప్పించేలా ఏర్పాటు చేశారు. ఈ మేరకు పిల్లలకు పలకలు, పుస్తకాలు పంపిణీ చేశారు.
గుత్తికోయలు, నిరుపేదలు చదువుకునేందుకు తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని డీఎస్పీ కిషన్ తెలిపారు. మావోయిస్టులకు సహకరించొద్దని, గ్రామంలో నూతన వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గుత్తికోయలకు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రాల హక్కులు హరించడంలో కాంగ్రెస్, భాజపాల పాత్ర : కేసీఆర్