ఈ నెల 15 నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంపూర్ణంగా ప్లాస్టిక్‌ను నిషేధించనున్నట్లు జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం కార్యక్రమంపై సింగరేణి ఇల్లందు క్లబ్‌హౌస్‌లో భూపాలపల్లి పట్టణ వర్తక, వ్యాపారులు, మున్సిపల్, సింగరేణి అధికారులు, మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 నుంచి భూపాలపల్లి పట్టణంతోపాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్‌ని వాడకూడదని ఆదేశించారు.
వర్తక, వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పర్యావరణానికి తద్వారా ప్రాణికోటికి విశేషమైన నష్టాన్ని కలిగించే మహమ్మారి ప్లాస్టిక్ అని, మన నిత్య జీవితంలో ఒకటైన ప్లాస్టిక్ వాడటం వలన అనేక రోగాలకు గురవుతున్నామని వివరించారు. ప్రజలందరూ సహకరించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఉపయోగించడానికి ఐకేపీ సంఘాలతో ఐదు లక్షల బట్ట సంచులను సిద్ధం చేయాలని మెప్మా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా మరో 5 లక్షల సంచులను సిద్ధం చేస్తామని... వర్తకవ్యాపారులు వ్యక్తిగతంగా బట్ట సంచులను సమకూర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.