జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర శైవక్షేత్రం... దక్షిణ కాశిగా పేరొందింది. కోరిన కోర్కెలు తీర్చే సన్నిధిగా ప్రఖ్యాతి గాంచింది. ప్రతిఒక్కరూ స్నానమాచరించేందుకు అక్కడ త్రివేణి సంగమం ఉంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల తీరంలో ప్రశాంతతకు నెలవుగా అది పేరుగాంచింది. అక్కడ స్నానమాచరించి దేవదేవుడిని దర్శించుకుంటే.. ఏ కోరికైనా తీరుతుందనేది అక్కడి భక్తుల విశ్వాసం. అయితే.. ఆ పవిత్ర తీరం నేడు దుర్గంధమయంగా మారింది.
![kaleshwaram-triveni-sangam-stinky-due-to-waste-at-mahadevpur-mandal-in-jayashankar-bhupalpally-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10518628_kale.png)
కాళేశ్వరంపై ఎందుకింత వివక్ష?
ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులు మారుతున్నారు. కానీ... కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ది జరగడంలేదనేది వాస్తవ సత్యం. ఎంతో సుందరంగా కనిపించే గోదావరి, ప్రాణహిత, అటవీసంపద కల్గిన క్షేత్రం పర్యాటక పరంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. ప్రభుత్వం కేటాయించిన నిధుల నుంచి పురాతన గుండం చెరువును మినీ ట్యాంకుబండ్‌గా మార్చాలనే ప్రతిపాదనలు చేశారు. కానీ అవన్నీ బుట్టదాఖలే అయ్యాయి.
![kaleshwaram-triveni-sangam-stinky-due-to-waste-at-mahadevpur-mandal-in-jayashankar-bhupalpally-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10518628_kal.png)
త్రివేణి సంగమం.. దుర్గంధమయం...
పవిత్రకు ప్రతీకగా చెప్పుకునే త్రివేణి సంగమం నేడు దుర్గంధమయంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటి నిల్వతో బ్యాక్ వాటర్ పెరిగిపోయేది. దీనితో నది ఎప్పుడూ నిండుగా ఉండేది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి(కన్నెపల్లి) పంపులు నిత్యం నడుస్తున్నాయి. నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ఫలితంగా అందులోని వ్యర్థాలన్నీ పేరుకుపోయాయి. నదిలోని చెత్తాచెదారం అంతా త్రివేణి సంగమ తీరంలోకి చేరింది. ముక్కు పుఠాలు అదిరిపోయే దుర్వాసన వస్తోందని భక్తులు చెబుతున్నారు. పవిత్ర స్నానం సంగతి దేవుడెరుగు కానీ... రోగాలు వస్తాయేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకే పానవట్టంపై కుడి వైపు యముడు, ఎడమ వైపు శివుని ద్విలింగాలు ఉండడం, శివ లింగానికి నాసిక రంధ్రాలు కల్గి ఉండడం కాళేశ్వరం ప్రత్యేకత. ఇంతటి ప్రాశస్త్యం కలిగి దేవదేవుడి సన్నిధానంపై పాలకులకు ఎందుకింత నిర్లక్షమో మరి! ఇకనైనా... ఆ సర్వదేవుడు అధికారుల కళ్లు తెరిపించాలని.. పాలకులను నిద్రలేపాలని ఆశిద్దాం.
ఇదీ చదవండి: మీ పేరున మొదటి ఇల్లు కొంటున్నారా? త్వరపడండి మరి!