కాళేశ్వరం ప్రాజెక్టు దేశవ్యాప్తంగా పేరొందిన పర్యాటక కేంద్రంగా మారుతోంది. రాష్ట్రానికి సాగు, తాగునీరందించే మానవ నిర్మిత అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు పర్యటకులు ఆసక్తి చూపుతున్నారు. మూడేళ్ల స్వల్ప వ్యవధిలో నిర్మితమైన అతిపెద్ద ప్రాజెక్టును దర్శించడమే కాకుండా సమీపాన ఉన్న ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవచ్చని సందర్శకులు పోటెత్తుతున్నారు. కుటుంబ సమేతంగా విజ్ఞాన, విహార యాత్రకు కాళేశ్వరం బాట పడుతున్నారు.
అలా మొదలైంది...
2016 మే 2న శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు... ఈ ఏడాది జూన్ 21 ప్రారంభమైంది. మానవ మహాద్భుత నిర్మాణంగా తలపెట్టిన ఈ కట్టడాన్ని సందర్శించాలనే ఉత్సుకత అందరిలో నెలకొంది. నిర్మాణ దశలో ఉన్నప్పుడే సందర్శనకు అనేకమంది తరలివచ్చారు. ప్రాజెక్టు పూర్తైన తర్వాత భారీసంఖ్యలో పర్యటకులు పోటెత్తున్నారు. గతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారంతా... ఇప్పుడు వారాంతాల్లోనూ... ఇతర సెలవు దినాల్లోనూ.... కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కాళేశ్వర సందర్శనకు క్యూ కడుతున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు...
పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం శాఖ నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఐదొందల రూపాయల ప్యాకేజీతో కాళేశ్వరం సందర్శనకు పర్యటకులు పోటెత్తారు. బస్ టిక్కెట్లు దొరక్క చాలామంది నిరాశ చెందారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి కాళేశ్వర అద్భుతాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం సుందిళ్ల బ్యారేజీలు... ఇలా నిండుకుండల్లా కనిపించే బ్యారేజీలు చూసి ఆనంద భరితులవుతున్నారు.
విజ్ఞానంతోపాటు దైవదర్శనం...
ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన వారు... సమీపాన కొలువై ఉన్న ముక్తీశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. దసరా సెలవలు ప్రారంభం కావడం వల్ల సందర్శకుల రద్దీ మరింత పెరగనుంది. రోజురోజుకీ పెరుగుతున్న పర్యటకులను దృష్టిలో ఉంచుకుని....ప్రాజెక్టు పరిసరాల్లో అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం... ప్రాజెక్టు గురించి సమగ్రంగా సమాచారం తెలిపేవారిని ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందన్నది సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: కాళేశ్వరంతో సాగునీటి రంగానికి కొత్తజీవం