paddy procurement in telangana: చేతికొచ్చిన పంటను అమ్మకోడానికి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్లోని ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులు సుమారు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు వర్షమొచ్చి... తమ ఆశలపై నీళ్లు చల్లేస్తుందేమోననే భయంతో ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చిన రైతులు రేయింభవళ్లు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా.. రోజుకో సాకు చూపించి కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు తెచ్చిన టార్ఫిన్ల అద్దె పెరిగిపోతోందన్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి.. డబ్బు చెల్లించాలని కోరుతున్నారు.
నెల కింద ధాన్యం తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. తూర్పారబట్టమంటే ఆరబెట్టినం.. ఎన్ని రోజులకు ఖాంటా పెడతారో తెలియడం లేదు. అసలు ఏ ధరకు కొంటారో, పైసలు చేతికెప్పుడొస్తాయో తెలియదు. వీటితోనే సచ్చుడు.. బతుకుడు అవుతోంది. -లక్ష్మి, మహిళా రైతు
పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతున్నాయని... ఇక్కడేమో పంటను కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని.. దిక్కుతోచని స్థితిలో రోజూ ధాన్యం వద్దే నిద్రపోతున్నామని అంటున్నారు.
అకాల వర్షాల వల్ల ఇప్పటికే పంటలు పోయాయి. ఏదో కొద్దో గొప్పో పండిన పంటను అమ్ముకుందామంటే కొనడం లేదు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెలరోజులు కావొస్తున్నా రోజుకో సాకు చూపించి కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. పంటను కొనుగోలు చేసి.. డబ్బులు చెల్లించాలి. -దేవేందర్, రైతు
ఆకాశంలో మబ్బు పడితే రైతు గుండెలో నీరు కారుతోంది. చేతికొచ్చిన పంట వర్షార్పణం అయిపోతుందేమోనని నిత్యం భయంతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: Bhupatipur Farmer Suicide : సీఎం కేసీఆర్కు లేఖ రాసి రైతు ఆత్మహత్య