Two Army Helicopters To Moranchapalli : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదలపై ప్రగతి భవన్ నుంచే సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో భాగంగా పూర్తిగా నీట మునిగిన భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈ మేరకు ముంపునకు గురైన మోరంచపల్లి గ్రామానికి రెండు సైనిక హెలికాప్టర్లను పంపుతున్నట్లు సీఎస్ తెలిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల వినియోగం ఇబ్బందిగా మారతాయన్న ఆలోచనతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మిలటరీ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి.. ఈ నిర్ణయం తీసుకుంది.
సీఎం ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతం నుంచి మోరంచపల్లి గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బోట్లలో పునరావాస కేంద్రానికి తరలించారు. వరదలో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర వరద ముంపు ప్రాంతాల్లో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు : వరద బాధిత జిల్లాల్లో పరిస్థితులు, సహాయక చర్యలు పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వీరు గతంలో ఆయా జిల్లాల్లో విధులు నిర్వర్తించిన అధికారులు కావడం విశేషం. ములుగు జిల్లాకు ప్రత్యేకాధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు గౌతమ్, నిర్మల్ జిల్లాకు ముషారఫ్ అలీ, మంచిర్యాల జిల్లాకు భారతి హోలికేరి, పెద్దపల్లి జిల్లాకు సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్ జిల్లాకు హన్మంతరావును ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది.
వేర్వేరుగా సమీక్షలు నిర్వహించిన కేటీఆర్, తలసాని : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వేర్వేరుగా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పడిన ఇబ్బందులను కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. అనంతరం హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని పరిశీలించి.. ముసారాంబాగ్ బ్రిడ్జి, మూసీ నది ప్రవాహం ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించే అవకాశం ఉంది. మరోవైపు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలుగలేదని తలసాని అన్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూంను సందర్శించిన మంత్రి తలసాని.. ట్రాఫిక్ సమస్యలపై పోలీస్ శాఖ కృషి చేస్తోందన్నారు.
జీహెచ్‌ఎంసీ ముట్టడి చేస్తాం : విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి పోటీ పడే మీరు.. ప్రజలు బయటకు రావాలంటేనే ఆలోచించుకునే దుస్థితిని హైదరాబాద్‌కు కల్పించారని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. అసమర్థపాలనలో ఇది విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయిందని మండిపడ్డారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ట్రాఫిక్ సమస్యలతో నగర ప్రజలు నానా యాతన పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతల కబ్జాలు, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలతోనే నగరానికి ఈ పరిస్థితి నెలకొందని లేఖలో పేర్కొన్నారు.
Revanth Reddy Open Letter To KTR : హైదరాబాద్ లో ఇలాంగటి పరిస్థితి రాబోతుందని తాము హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ చర్యలు చపట్టాలని సూచించారు. ప్రభావిత ప్రజలకు పదివేల సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి :