Kaleshwaram Project : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ఎనిమిది రోజులుగా కురుస్తున్న వర్షం.. శుక్రవారం విరామం ఇవ్వడంతో ప్రవాహ జోరు తగ్గింది. తెలంగాణ, మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలతో, ప్రాజెక్టుల నీటి విడుదలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద ఉద్ధృతి కొనసాగింది.
1986లో వచ్చిన వరదలను మించిపోయాయి. మేడిగడ్డ వద్ద 28,67,650 క్యూసెక్కుల భారీ ప్రవాహం నమోదు కాగా.. ప్రస్తుతం 16,71,388 క్యూసెక్కులకు చేరింది. మేడిగడ్డలో మొత్తం 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీకి 2,41,891 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరం త్రివేణిసంగమం వద్ద 13 మీటర్లకు నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా పరిస్థితులు కుదుటపడలేదు. తెలంగాణ-మహారాష్ట్ర వంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోగా పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద అప్రోచ్ రహదారి పూర్తిగా దెబ్బతింది. భారీ వర్షాలతో మహదేవపూర్ మండలంలోని పది గ్రామాలు, పలిమెల మండలం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్, వైద్యం, రవాణా, తాగునీటి లాంటి కనీస వసతులు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.