Moranchapalli Floods News : ఊహకు అందని నష్టం.. మాటల్లో చెప్పలేని విషాదం.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామ దయనీయ పరిస్థితి ఇది! ఇళ్లలో హాయిగా ఆదమరిచి నిద్రపోతున్న వారిపై ఉప్పెనై వరదలు విరుచుకుపడ్డాయి. ఏం జరిగిందో తెలిసుకునే సమయం కూడా లేకుండా మోరంచ వాగు రక్కసిలా గ్రామస్థులపై విరుచుకుపడింది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని చూస్తే.. సునామీ బీభత్సమే గుర్తుకు వస్తుంది.
Floods in Moranchapalli : ఏ ఇంట చూసినా.. వరద నింపిన విషాదమే కనిపిస్తోంది. ఊరిని ముంచెత్తిన భారీ వరదల నుంచి ప్రాణాలతో బయటపడిన గ్రామస్థులు.. తమ ఇళ్ల ప్రస్తుత పరిస్థితులు చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్న కాస్త గూడూ వరదల ధాటికి దెబ్బతినడంతో 'ఎట్లా బతికేదీ' అంటూ ఆందోళన చెందుతున్నారు. బాధితులను పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించి ధైర్యం చెప్పినా.. వరద తాలూకు భయానక దృశ్యాల నుంచి వారింకా బయటకు రాలేకపోతున్నారు.
Moranchapalli Floods : అలాగే వంతెనలు, రహదారులు పూర్తిగా కోతకు గురయ్యాయి. వరద ధాటికి కొట్టుకుపోయిన కార్లు.. ఇతర వాహనాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇక ఇళ్లూ వీధులు ఇప్పటికీ బరుదమయమయ్యాయి. ఇప్పటికీ కొందరి ఇళ్ల పరిసరాల్లో వరద నీరు నిలిచే ఉంది. ఇక ముంచెత్తిన ఉప్పెనను తలచుకుని స్థానికులు హడలిపోతున్నారు.
"ఇంటి తలుపులు తీసే సరికి ఇంట్లోకి వస్తానే ఉన్నాయి. తొందరగా బయటకకు వెళ్లాలని ఇంట్లో వాళ్లని పిలిచేసరికి.. ఇంకా పెరిగింది. ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్లేసరికి.. రోడ్డు అవతల నాలుగు ఫీట్ల లోతులో నీళ్లు ఉంది. అవతల వైపు మేము వెళ్లలేని పరిస్థితి. ఇటు ఎటువైపు మార్గం లేక ఇంట్లో ఉన్న పిండి బస్తాలు ఎక్కాము.అవి కూడా కిందకి కుంగితే.. మేడ మీదకి వెళ్లాము. నాలుగు గంటల దగ్గర నుంచి 12 గంటల దాకా అక్కడే కుర్చున్నాం. అంతలోకి మా బంధువులు ఒక పంది మంది వచ్చారు. తాడు తెచ్చి దానిని పట్టుకొని ఒకొక్కరిని కిందకి దింపి వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు. అలా వారి దగ్గర కాసేపు ఉన్నాం." -స్థానికులు
Moranchapalli Roads Damage Rains : గ్రామస్థులే ఒకరికొకరు సాయంగా నిలిచి కొట్టుకుపోతున్న వారిని కాపాడుకున్నారు. ఇప్పటికే గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాలు దొరకగా.. రాత్రి వజ్రమ్మ అనే మహిళ మృతదేహం నేరెడ్‌పల్లి శివార్లలో లభ్యమైంది. వరదల్లో గల్లంతైన మరొకరి జాడ ఇప్పటికీ తెలియరాలేదు. మరికొందరు గ్రామస్థులు మానవత్వంతో తమ చుట్టుపక్కల వారిని కూడా కాపాడి.. ఉదారత చాటుకున్నారు.
వయస్సులో ఉన్న వాళ్లే.. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బతుకు జీవుడా అంటూ పరుగులు పడితే.. వయస్సు మీద పడిన వృద్ధులు.. ఆ కాళరాత్రిని గుర్తు చేసుకుని బెంబేలెత్తి పోతున్నారు. సర్వం కోల్పోయి.. కట్టుబట్టలతో మిగిలామని మోరంచపల్లి గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. సాగుకు అవసరమైన పిండి బస్తాలూ, మందు సంచులు వరదల పాలైయ్యాయని కొందరంటుంటే.. పశువులు కోల్పోయి.. జీవనాధారం లేకుండా పోయిందంటూ ఇంకొందరు బోరుమంటున్నారు. మోరంచ ఉప్పెన మిగిల్చిన విషాదం నుంచి గ్రామస్థులెవరూ ఇప్పట్లో కోలుకునేలా లేరు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పెద్దమనస్సు చేసుకుని.. అండగా ఉంటేనే ఈ చేదు జ్ఞాపకాలను చెరిపేసుకుంటుంది.
ఇవీ చదవండి: