నీతి అయోగ్ సహకారంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిరు ధాన్యాలతో కూడిన పౌష్టికాహారం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య రాజన్ పేర్కొన్నారు. ఆస్పిరేషనల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆస్పిరేషనల్ జిల్లాల్లో నిరుపేదలు అధికంగా ఉంటారని.. అందువల్ల ఆయా జిల్లాల్లో ఉండే చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు ప్రభుత్వం తరఫున పౌష్టికాహార కల్పన కార్యక్రమాలు అధికంగా నిర్వహించాలని సూచించారు. వారి ఆరోగ్య సంరక్షణకు నీతి అయోగ్ సహకారంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిరు ధాన్యాలతో కూడిన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలు వేయాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో వెంటనే జిల్లా స్థాయి కమిటీ వేసి చిరు ధాన్యాల ప్రాధాన్యతపై ప్రజలకు తెలియజేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నీతి అయోగ్ సహకారంతో చిన్నారులకు, బాలింతలు, గర్భిణీలకు చిరు ధాన్యాలతో కూడిన ఆహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఒక ఎకరం స్థలంలో మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యంబాబు, సీడీపీవో అవంతిక, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ రవికుమార్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 24 గంటల్లో కరెంట్ సరఫరా జరగాలి: కేటీఆర్ ఆదేశం