పల్లెప్రగతి కార్యక్రమాల ప్రగతిపై మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి ఇల్లందు క్లబ్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈజీఎస్ ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లతో సమావేశం నిర్వహించి పల్లె ప్రగతి పనుల పురోగతిపై సమీక్షించారు.
వాటిని వెంటనే పూర్తి చేయండి..
పల్లెప్రగతి పనుల ప్రగతిపై అధికారులు నిరంతరం పర్యవేక్షించడంతో ప్రస్తుతం పనుల అభివృద్ధిలో ప్రగతి కనిపిస్తుందని కలెక్టర్ అన్నారు. కానీ జిల్లా ఇంకా వెనుకబడి ఉన్నందున అన్ని స్థాయిల అధికారులు మరింత బాధ్యతగా గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రకృతివనం, వైకుంఠధామాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబోసేందుకు నిర్మిస్తున్న పంట కల్లాల నిర్మాణాలపై దృష్టిసారించి పూర్తి చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనులను చేపట్టేందుకు ఈ సమయం అనుకూలమైనదని.. అన్ని గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డీఆర్డీఓ శైలజ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్ తదితరులు, అధికారులు పాల్గొన్నారు.