Clash between Congress and BRS at Bhupalapally: రాజకీయ నాయకులు తమ ప్రతిభ చూపించుకోడానికి ఫ్లెక్సీలను చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలు పెట్టేందుకు స్థలం కొరత ఏర్పడుతుంది. చిన్న నుంచి పెద్ద నాయకుడు ఎవరు వచ్చిన ఇవి ముఖ్యంగా పెడుతున్నారు. చివరికి అవి పెట్టేందుకు ప్రదేశం లేక పార్టీ కార్యకర్తలు ఘర్షణలకు దిగుతున్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ ఫ్లెక్సీలు కట్టనివ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా హాథ్ సే హథ్ జోడో యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర జరగనుంది.
సెల్ టవర్ ఎక్కి ఆందోళన: ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఫ్లెక్సీల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట అయింది. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టి ఐదు రోజులు అవుతున్న తొలగించలేదని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోయారు. నగర పంచాయతీకి చెప్పినప్పటికీ కూడా ఫ్లెక్సీలు తీయనందున ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించాలంటూ కాంగ్రెస్ కార్యకర్త సాగర్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
గొడవకి కారణం ఏమిటి?: ఈ నెల 23వ తేదిన జరిగిన కేటీఆర్ బహిరంగ సభ సందర్భంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు వాటిని తొలగించ లేదు. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యాత్రలో భాగంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీ ముందు కాంగ్రెస్ ఫ్లెక్సీ కడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు, మున్సిపల్ చైర్మన్ భర్త సిద్దు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగింది.
పోలీసుల జోక్యం: భూపాలపల్లి డీఎస్పీ రాములు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని ఇరు వర్గాలను అదుపులో పెట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ఇవీ చదవండి: