జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఎంపీపీ వినోద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను రాకుండానే పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయోత్సవ సంబరాలు నిర్వహించడంపై ఎంపీపీ వినోద ఆక్రోశం వెల్లగక్కారు. సంబరాలకు ఆహ్వానించి తాను రాకుండానే పూర్తి చేయడమేంటని ప్రశ్నించారు. "నాకు పదవి ఉత్తగ రాలేదు.. రూ .50 లక్షలిస్తే వచ్చింది" అంటూ ఎంపీపీ వినోద పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటన ఆదివారం రోజు చిట్యాల మండల కేంద్రంలో జరగ్గా... దీనికి సంబంధించిన ఒక వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినోద చేసిన వ్యాఖ్యలు... ఎంపీపీల దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయని మండల ప్రజాపరిషత్ సభ్యులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. మహిళ ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు.
కష్టపడి గెలిచామని.. చిట్యాలలో తమతో రాజకీయం చేస్తూ... కష్టపడ్డ నాయకులకు గుర్తింపు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీపీ పరిస్థితి ఇలా ఉంటే ప్రజాప్రతినిధులు, నాయకుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పెత్తనం చేసే నాయకులను చూస్తే కనబడుతుందని నెటిజన్లు వాపోతున్నారు.