CWC about flood to Kaleshwaram : కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. అక్కడ నది 107.56 మీటర్ల వద్ద ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. 1986లో వచ్చిన గరిష్ఠ నీటిమట్టాన్ని మించి తీవ్ర వరద పరిస్థితి ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది. ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించింది.
మంచిర్యాల వద్ద కూడా గరిష్ఠ నీటిమట్టాన్ని దాటి 138.86 మీటర్ల వద్ద ప్రవహిస్తున్నట్లు సీడబ్ల్యూసీ పేర్కొంది. గోదావరి ఎగువన పెన్ గంగ, వార్ధా నదులు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ముంగోలి వద్ద పెన్ గంగ నది గరిష్ఠ నీటిమట్టమైన 97.55 మీటర్లను అధిగమించి 100.8 మీటర్ల వద్ద ప్రవహిస్తున్నట్లు చెప్పింది. అటు వార్ధా నది మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిర్పూర్ వద్ద గరిష్ఠ నీటిమట్టాన్ని అధిగమించి చాలా ఎక్కువగా ప్రవహిస్తున్నట్లు తెలిపింది. అక్కడ 162 మీటర్ల వద్ద నదీ ప్రవాహం ఉందని వివరించింది.