Celebrations at Chandra Bose hometown challagariga: ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో రాజమౌళి దర్శకత్వంలోని ట్రిపుల్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట అవార్డు గెలుచుకోవడంపై తెలుగు ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గేయ రచయిత చంద్రబోస్ స్వగ్రామం అయినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం చల్లగరిగ గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. చల్లగరిగలో చంద్రబోస్ పుట్టినందుకు గర్వంగా భావిస్తున్నామన్నారు. అతని ఇంటి వద్ద మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చారు.
"చల్లగరిగకు చెందిన కనుకుంట్ల నర్సయ్య, మదునమ్మ దంపతులకు చంద్రబోస్ మూడో కుమారుడు. పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లోనే గ్రామంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. శివాలయంలో జరిగే భజనలో పాల్గొంటూ పాటలు పాడేవాడు. గ్రామంలోని గ్రంథాలయంలో సాంస్కృతిక కథనాలు, గ్రంథాలు చదువుతూ పాటలు రాయడం మొదలుపెట్టి తాజ్‌మహల్ సినిమాలో "మంచుకొండల్లోన చందమామ" పాట రాసి సినిమా గేయ రచయితగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతను రాసిన నా ఆటోగ్రాఫ్ మూవీలోని 'మౌనంగానే ఎదగమనే' పాట, నేనున్నాను చిత్రంలోని 'చీకటితో వెలిగే చెప్పెను" పాటలకు నంది అవార్డులు , ఫిలింఫేర్ అవార్డులు దక్కాయన్నారు. ఇంకా మనస్వి ఆత్రేయ అవార్డు వచ్చాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం చాలా సంతోషం కలిగించింది". -వీరారెడ్డి బాల్య స్నేహితుడు
"చంద్రబోస్‌ను చూసి గర్వంగా ఉంది. ఇలాగే తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ.. భవిష్యత్త్‌లో ఇటువంటి మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుతున్నాను. అతని స్ఫూర్తితో గ్రామంలో కొంతమంది యువకులు ఉత్సాహంగా గ్రామాభివృద్ధి పనులు చేస్తున్నారు. చంద్రబోస్ అవార్డు తీసుకుని స్వదేశానికి వచ్చాక గ్రామానికి ఆహ్వానించి ఘనంగా సన్మానిస్తాము". - నాగరాజు గ్రామస్థుడు
ఖమ్మంలో ట్రిపుల్ఆర్ వేడుకులు..
మొదటిసారి ఒక తెలుగు సినిమా పాటకు ఆస్కార్ ఆవార్డు అందుకోవడం పట్ల ఖమ్మంలో పలు రాజకీయపార్టీలు వేడుకలు నిర్వహించాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచారు. ఆర్‌ఆర్‌ఆర్ సినీ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పాటకు దక్కిన గౌరవం అంటూ సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి బాణా సంచాకాల్చారు. రోడ్డుపై వచ్చి పోయే వారికి మిఠాయిలు పంచారు. ఖమ్మం ఎన్టీఆర్ భవన్‌లో నాటు నాటు పాటకు నృత్యాలు చేశారు.
ఇవీ చదవండి: