జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల చివరిలోపు ..
రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని సంకల్పించినందున .. జిల్లా స్థాయిలో వివిధ శాఖల వారీగా అర్హులను గుర్తించి పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ పక్రియను ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్నా వారి జాబితాను రూపొందించి వెంటనే ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. పదోన్నతితో ఖాళీ అయ్యే ఉద్యోగాల వివరాలతో పాటు పదోన్నతులు, కారుణ్య నియామకాల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.
వేగవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన రైతు వేదికల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, వైకుంఠ ధామాలు, పంట కల్లాల నిర్మాణ పనులు ఇప్పటివరకు ఆశించిన మేరకు ప్రగతి సాధించడం జరిగిందని తెలిపారు. ఆయా పనుల ప్రగతిలో వెనుకబడి ఉన్న జిల్లాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను నాటేందుకు నర్సరీల ఏర్పాటు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఆర్థిక చేయూతనిచ్చేందుకు
కరోనా కారణంగా .. ఉపాధి లేక ఆర్థికంగా దెబ్బతిన్న గ్రామీణ ప్రజలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రజలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు అధికంగా పనులను చేపట్టాలని ఆదేశించారు. కూలీల హాజరు శాతం అధికంగా పెరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొవిడ్-19 టీకాను వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు.
పూర్తి చేస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టి నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, డీఆర్డీఓ శైలజ, జడ్పీసీఈఓ నాగ పద్మజ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పంచుకుంటున్నారా.. తెంచుకుంటున్నారా!?