క్రిమి సంహారక మందుల నాణ్యతను పరీక్షించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు కరవయ్యారు. రాష్ట్రంలో రెండు చోట్ల మాత్రమే పరీక్షా కేంద్రాలున్నాయి. ఒకటి హైదరాబాద్‌లో, మరోటి వరంగల్‌లో ఉంది. వ్యవసాయ శాఖ 1999లో వరంగల్‌లో ఏర్పాటు చేసింది. ఒక ఏడీఏ, ఆరు ఏవో, ఒక సీనియర్ అసిస్టెంట్, రెండు కార్యాలయ అసిస్టెంట్ పోస్టులను కేటాయించింది. వివిధ జిల్లాల్లో సేకరించిన మందుల నమూనాలను పరీక్షించి.. ఫలితాలను పంపిస్తారు. నాణ్యత లోపిస్తే.. ఆయా కంపెనీల మందులను మార్కెట్‌లో విక్రయించకుండా నిషేధిస్తారు. అయితే గతేడాది నుంచి ఈ కేంద్రంలో వ్యవసాయాధికారులు ఉండటం లేదు. ప్రభుత్వం నియమించినా వివిధ రకాల కారణాలు, సిఫారసులతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. పురుగు మందుల నాణ్యత పరీక్షలను గాలికి వదిలేశారు.
ప్రస్తుత పరిస్థితి ఇలా.
ఆరుగురు ఏవోలు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. హైదరాబాద్ నుంచి నమూనాలను పంపిస్తున్నారు. ఒక్క వ్యవసాయాధికారి మాత్రమే పరీక్షలు నిర్వహించి.. ఫలితాలను పంపించాల్సి ఉంటుంది. ఇదీ ఎలా సాధ్యమవుతుందో ఉన్నతాధికారులకే తెలియాలి. ఇక్కడ పని చేయాల్సిన ఏవోలు డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. మరో ఏవో శ్రీనివాస్.. విజిలెన్స్ ఎన్ ఫోర్స్‌మెంట్ ఏవోగా వెళ్లారు. ఇంకో అధికారిణి భూసార పరీక్షా కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లారు. మరో ఏవో మెటర్నటీ లీవ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు.
వరంగల్ కేంద్రంలో మొత్తం ఆరు పోస్టులున్నాయి. వీరిలో ఐదుగురు ఏవోలు వివిధ ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఒక్కరు మాత్రమే మిగిలారు. ఆమెనే పరీక్షలు చేయాల్సి వస్తుంది. రాష్ట్ర అధికారులు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలంటే ఆరుగురు ఏవోలు పనిచేయాల్సిందే. లేకుంటే పరీక్షలు పూర్తి చేయడం కష్టమే. డిప్యూటేషన్‌పై వెళ్లిన వారి స్థానంలో కొత్త వారిని నియమించాలి.
- అవినాష్‌వర్మ, వరంగల్ క్రిమిసంహరక పరీక్ష కేంద్రం ఏడీఏ
ఏటా వరంగల్ కేంద్రానికి సుమారు 1500 పురుగుమందుల నమూనాలు వస్తుంటాయి. ఈ సారి కూడా 1455 నమూనాలు లక్ష్యంగా ఇచ్చారు. ఈ పరీక్షలను కూడా నిర్ణీత గడువు లోపు పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ఫలితాలను ఇస్తే మార్కెట్‌లోకి నాసిరకం మందులు వెళ్లే అవకాశం ఉంటుంది. రైతులకు నష్టం వాటిల్లక తప్పదు.
ఇవీ చూడండి: రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన