జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైతుల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వ్యాఖ్యానించారు. స్థానిక శాసన సభ్యులు తాటికొండ రాజయ్య, జిల్లా కలెక్టర్ నిఖితతో కలిసి.. రైతు వేదిక, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మల్లన్న గండి జలాశయం నుంచి వల్లభరాయ చెరువుకు నీటిని విడుదల చేశారు.
సర్వాయి పాపన్న కోటలో.. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, విధిగా మాస్కు ధరించాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ పంట మార్పిడి విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ రైతులు ధాన్యం నిల్వ చేసుకోవడానికి వీలుగా రూ.30 కోట్లతో గోదాముల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. తాటికొండ సర్వాయి పాపన్న కోటలో నిర్వహిస్తున్న పార్కును మోడల్ పార్క్ గా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్..!