అతడు మైదానంలోకి అడుగు పెట్టాడంటే పతకాల పంట పండేది. ఆటల్లో మేటిగా సాగిపోతున్న జీవితం అనుకోని మలుపు తిరిగి.. ఆట ఆగిపోయింది. బతుకు బాటలో కష్టాలు ఎదురయ్యాయి రోడ్డు ప్రమాదం ఆ క్రీడాకారుడి జీవితాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. జనగామ జిల్లా.. స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన శాతపురం అనిల్ దీనగాథ ఇది.
జట్టుకు.. అతడే వెన్నెముక!
పాఠశాల స్థాయి నుంచే అనిల్ క్రీడల్లో ప్రతిభ చూపేవాడు. కాకతీయ యూనివర్శిటీ వాలీబాల్ జట్టు తరఫున అనేక టోర్నమెంట్లు ఆడి.. జట్టు విజయానికి వెన్నెముకగా నిలిచాడు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే.. ఉస్మానియా యూనివర్శిటీలో యూజీపీడీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగ అన్వేషణకై పలు పోటీ పరీక్షలు రాశాడు. కానీ.. ఫలితం అతనికి అనుకూలంగా రాలేదు. బతుకుదెరువు కోసం ప్రైవేటు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరాడు. హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇంతలో అనిల్ జీవితంలో ఊహించని మలుపు. ఓ కుదుపు అతడి జీవితాన్నే మార్చేసింది.
చావు తప్పింది.. బతుకు గతి తప్పింది!
గతేడాది ఇప్పగూడెం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం అనిల్ జీవితాన్ని చిందరవందర చేసింది. సముద్రాల గ్రామ పరిధిలో అనిల్ నడిపిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముక దెబ్బతిని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అనిల్ పరిస్థితి చూసి అతని స్నేహితులు చలించిపోయారు. తమవంతు సాయంగా అందరూ కలిసి ఆర్థిక సహాయం చేసి అనిల్‌ను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాడు. ప్రాణాలు దక్కినా.. మంచంపై నుంచి కదలలేని స్థితికి చేరాడు. వెన్నెముక దెబ్బతినడం వల్ల ఎక్కడికి కదలలేడు. గత రెండేళ్లుగా మంచంలోనే పడి ఉంటున్నాడు. ప్రతి నెల సుమారు ఐదువేల వరకు మందులకు ఖర్చు కూడా స్నేహితులే భరిస్తున్నారు.
ఆదుకునే హస్తం కోసం..
అనిల్ స్నేహితులు అతడి వైద్యం, మందుల ఖర్చు భరిస్తున్నా.. కుటుంబ పోషణ అతడి భార్యకు భారమైంది. ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో రోడ్డు ప్రమాదం ఊహించని కన్నీళ్లను నింపింది. కాలకృత్యాల కోసం కూడా మంచం దిగలేని పరిస్థితిలో ఉన్న అనిల్‌ని వదిలి అతని భార్య ఎక్కడికి వెళ్లలేకపోతోంది. ఏ పనికి వెళ్లలేకపోవడం వల్ల ఇల్లు గడవడం కష్టంగా ఉందంటూ.. సాయం చేయాలని అర్థిస్తోంది. సరైన వైద్యం అందితే.. లేచి నిలబడతానని.. కుటుంబాన్ని పోషించుకుంటానని కన్నీళ్లు నిండిన కళ్లతో.. అనిల్ ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రణబ్ నిరుపమాన రాజనీతిజ్ఞుడు.. పాలనా విశారదుడు