కరోనా వైరస్ కోరలు చాస్తున్న వేళ ధాన్యం కొనుగోళ్లపై రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ధాన్యం కొనుగోళ్లే కాదు.. అన్నదాతల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటోంది.
టోకెన్ల జారీ
వ్యక్తుల భౌతిక దూరాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రైతులకు టోకెన్లు జారీ చేస్తోంది. కోతలకు ముందు రైతులు అధికారులకు సమాచారం ఇవ్వాలి. వారు పలానా తేదీన కొనుగోలు కేంద్రానికి రావాలని అధికారులు టోకెన్ అందజేస్తారు. ఆ టోకెన్‌తో రైతులు కేంద్రాలకు వెళ్లి మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించవచ్ఛు. ఎప్పుడంటే అప్పుడు రైతులు కేంద్రాలకు వెళితే లాభం లేదు.
● ప్రతిపాదించిన కొనుగోలు కేంద్రాలు
● ప్రారంభమైనవి
ఈసారి యాసంగి పంటలు బాగా పండాయి. ఇటు కాకతీయ కాలువ, అటు దేవాదుల ద్వారా నీరు పుష్కలంగా అందడం వల్ల చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్‌లో 4.88 లక్షల ఎకరాల్లో వరి పండింది. అన్నదాతలు ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా కరోనా రక్కసి విరుచుకుపడగా... అన్ని వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి.
వరి కోతల తర్వాత ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషించదగ్గ విషయం. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల పరిధిలో ఐకేపీ, పీఏసీఎస్ 857 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించాయి. వీటిలో ఇప్పటికే 266 ప్రారంభమయ్యాయి. వీటిల్లో నెమ్మదిగా కొనుగోళ్లు మొదలయ్యాయి. కొవిడ్-19 భయపెడుతున్న ఈ సమయంలో అన్నదాతలు ఎంతో అప్రమత్తతతో ధాన్యం విక్రయించాలి.
ఇవి తప్పనిసరి
కేంద్రాల వద్ద భౌతిక దూరాన్ని విస్మరించకూడదు. కొన్ని కేంద్రాల వద్ద కాంటాలు వేసేప్పుడు, ధాన్యం బస్తాల్లోకి ఎత్తేటప్పుడు దూరం పాటించడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎక్కువ సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిత్యం పరిమిత సంఖ్యలో రైతులు వస్తుంటారు. కాబట్టి రద్దీ ఎక్కువ ఉండదు. ఈ క్రమంలో ఆయా కేంద్రాల నిర్వాహకులు భౌతిక దూరం పాటించేలా రైతులను చైతన్యపర్చాలి.
మాస్కులు ధరించడం తప్పనిసరి. ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో మాస్కులు అందజేస్తుండగా, కొన్ని చోట్ల అసలు మాస్కుల ఊసే లేదు. రైతులు తమ వెంట తెచ్చుకున్న టవల్‌ను కట్టుకోవాలి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద కచ్చితంగా చేతులు కడుక్కోవడానికి సబ్బు, శానిటైజర్ ఉండాలనే నిబంధన ఉంది. కొన్ని చోట్ల ఏర్పాటు చేయలేదని సమాచారం. ఈ విషయంలో అధికారులు చొరవ చూపాలి. ప్రభుత్వ నిబంధనలు అమలయ్యే విధంగా చూడాలి.