జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గత 35 ఏళ్ల నుంచి సుమారు 20కి పైగా వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో సుమారు 15 నుంచి 20 మంది కార్మికులు విగ్రహాలు తయారు చేస్తూ... ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ పనిచేసేందుకు పొట్టచేత పట్టుకొని వచ్చినవారెందరో ఉన్నారు. ఇప్పుడు వాళ్లందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పులు కుప్పలైపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ సీజన్‌లో వచ్చే లాభాలతోనే ఏడాదంతా గడిపేస్తుంటారు.
పండుగకు ఐదు రోజుల ముందు ఆదేశాలు..
గతేడాది వినాయక చవితికి ఆరు నెలల ముందు నుంచే లక్షల ఖర్చు చేసి పెద్ద, పెద్ద వినాయకులను తయారు చేశారు. కానీ దురదృష్టవశాత్తు కరోనా రావడం వల్ల ... పండుగకు ఐదు రోజుల ముందు విగ్రహాలను తక్కువ ఎత్తులో తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే ఎత్తైన విగ్రహాలు తయారు చేసిన నిర్వాహకులు చాలా నష్టపోయారు. కనీసం ఈ ఏడైన ప్రభుత్వం ముందుగానే నిబంధనలు సూచిస్తే... తయారీదారులు నష్టపోకుండా ఉంటారు. అలాగే ఎంతో మంది కార్మికులకు ఉపాధి కూడా దొరుకుతుంది.
ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే..
ప్రభుత్వం త్వరగా ఆదేశాలు జారీ చేస్తే.. నిబంధనల ప్రకారమే విగ్రహాలను తయారు చేసుకుంటామని తయారీదారులు చెబుతున్నారు. ఈ సారి ఉత్సవాలను ఘనంగా జరిపించే అవకాశం ఉందని అనిపించినా... గతేడు చూసిన నష్టాల కారణంగా ధైర్యం చేయలేకపోతున్నామని చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే బాగుంటుందని అంటున్నారు.
'పదేళ్ల నుంచి ఇదే పని చేస్తున్నాం. గతేడాది కరోనా కారణంగా మాకు లేని ఇబ్బందులు వచ్చాయి. ఆర్థికంగా చాలా నష్టపోయాం. ప్రభుత్వం ఆంక్షల వల్ల పోయినసారి లేబర్‌కు జీతాలు కూడా ఇవ్వలేకపోయాం. ప్రభుత్వం స్పందించి తోచిన సాయం చేస్తే... మా బతుకులు బాగుపడ్తయి. వినాయక చవితికి సంబంధించిన ఆంక్షలు ముందే చెప్తే.. వాటని బట్టి మేం నిర్ణయం తీసుకుంటాం. కనీసం ఈ సారైనా నష్టాల పాలవకుండా ఉంటే చాలు.
- శంకర్ గౌడ్, వినాయక విగ్రహ కేంద్రం నిర్వాహకుడు కోరుట్ల
కొందరు తయారీదారులు గతంలో తయారు చేసిన పెద్ద, పెద్ద విగ్రహాలకు రంగులు అద్దుతూ పండుగ కోసం సిద్ధం చేస్తున్నారు. త్వరగా నిబంధనలు వెల్లడించడమే కాకుండా వినాయక తయారీ కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించి ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: పోస్టుల వర్గీకరణ పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం