Manauru Manabadi Program: "మన ఊరు-మన బడి" పథకం కింద జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 4 ప్రాథమిక పాఠశాలలు, 3 ఉన్నత పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో 'మన బస్తీ-మన బడి' పథకం కింద.. 24 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా 2 మూత్రశాలలు, వంటశాల, ప్రహారీ గోడ, నీటి సంపుతోపాటు పాఠశాల మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం కోసం ప్రణాళిక రూపొందించారు. గుత్తేదారు పనులు ప్రారంభించినప్పటికీ.. బిల్లులు రాకపోవటంతో పనులు మధ్యలోనే నిలిపివేశారు.
నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవటం, ఎక్కడికక్కడ ఉంచిన సామగ్రితో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఐదోతరగతి వరకు ఉన్న ఇందిరానగర్ పాఠశాలలో 180 మందికి 2గదులు మాత్రమే ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుబయట, చెట్ల కింద కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. మెట్‌పల్లి మినీస్టేడియం పక్కన ఉన్న గాజులపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మన బస్తీ-మన బడి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం.. అభివృద్ధి కోసం 11 లక్షల రూపాయలను మంజూరు చేసింది.
ఇప్పటివరకు గుత్తేదారుకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే రావటంతో.. మధ్యలోనే పనులు నిలిపివేశారు. నిర్మాణంలో భాగంగా ఇక్కడ తీసిన గోతులు ప్రమాదకరంగా మారాయి. అటు శివాజీనగర్ ప్రాథమిక పాఠశాలలో 175 మంది విద్యార్థులు ఉండగా.. 2 మాత్రమే తరగతి గదులు ఉన్నాయి. పథకంలో భాగంగా ప్రభుత్వం ఈ పాఠశాలను ఎంపిక చేసినా గదులు నిర్మించటంలేదంటున్నారు.
మెట్‌పల్లిలోనే కాకుండా మరికొన్ని పాఠశాలల్లోనూ ఇదే విధంగా పనులు మధ్యలో ఆగిపోయాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టి.. అన్ని హంగులతో పాఠశాలలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నా.. నిధుల విడుదల చేయకపోవటంతో ఆరంభంలోనే హంసపాదు అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించి పనులు పూర్తిచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
"మా పాఠశాలలో 180 మంది పిల్లలు ఉన్నారు. వారికి కేవలం రెండు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. మన ఊరు మన బడి పథకం కింద మా పాఠశాలకు రూ.24 లక్షలు మంజూరయ్యాయి. కంపౌండ్ వాల్ పనులు పూర్తియ్యాయి. కిచెన్ పనులు, వాస్ రూం పనులు ఇంకా పూర్తికాలేదు. బిల్డర్స్‌ని అడిగితే నిధులు మంజూరుకాలేదు అందుకే చెయ్యడం లేదని చెప్పారు."-బాలకృష్ణ, ఉపాధ్యాయుడు ఇందిరానగర్ ప్రభుత్వపాఠశాల
"మా పాఠశాలలో సమారు 175 మంది పిల్లలు ఉన్నారు. వారికి కేవలం రెండు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. మన ఊరు మన బడి పనులు కింద రూ.3 లక్షలు వచ్చినా.. సగం బిల్లులే కాంట్రాక్టర్‌కి రావడంతో పనులు సగంలోనే ఆపివేశారు".-శ్యాంసుందర్, ప్రధానోపాధ్యాయుడు గాజులపేట ప్రభుత్వ పాఠశాల
ఇవీ చదవండి: