ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రైతులు ఆందోళన బాటపట్టారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులందరూ సమావేశమై అక్కడి నుంచి భారీ ర్యాలీగా పాత బస్టాండ్ వరకు చేరుకున్నారు. శాస్త్రి చౌరస్తా వద్ద గల జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం ముందుగా చక్కెర పరిశ్రమను తెరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న ఒక్క షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తే పంట మార్పిడి చేసేందుకు అవకాశం ఉందని రైతు నాయకులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మెట్‌పల్లి చెరకు రైతులకు అండగా జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లా రైతులు సైతం ధర్నాలో పాల్గొన్నారు. మొక్కజొన్న, వరి పంటల సాగు వద్దంటే... ఉన్న ఒక్క పసుపు పంటకు మద్దతు ధర లేక పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. క్వింటా పసుపుకు రూ. 15వేలు అందించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరతో మక్కలను కొనుగోలు చేయాలని కోరారు. రైతులు జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చదవండి: Rajath Kumar Comments: 'కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం'