Peddapur Mallanna Bonalu: ఉత్తర తెలంగాణలోనే అతిపెద్దదైన పెద్దాపూర్ మల్లన్న బోనాల జాతర వైభవంగా జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్‌లో కొలువైన మల్లన్న స్వామి బోనాల జాతరను గత 35 ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. హోలీ పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున మల్లన్న స్వామికి బోనాలు తీయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలను శనివారం నుంచి సోమవారం(మార్చి 19 నుంచి 21) వరకు మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
కమనీయం.. బోనాల ప్రదక్షిణం
భక్తులు 30 వేలకు పైగా బోనాలను మల్లన్న స్వామికి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేల బోనాలతో.. మహిళలంతా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు కనువిందు కలిగించాయి. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది.
పెరుగుతున్న రద్దీ
మల్లన్న బోనాల జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన జనంతో పెద్దాపూర్ గ్రామం కిటకిటలాడింది. ప్రతి సంవత్సరం స్వామి సన్నిధికి భక్తులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. మల్లన్నను వేడుకుంటే కష్టాలు తీరుతాయనే నమ్మకంతోనే పెద్ద ఎత్తున తరలివస్తున్నారని పేర్కొన్నారు. రద్దీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: BHADRADRI TEMPLE: భద్రాద్రి క్షేత్రం .. భక్తజన సంద్రం