జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామ పంచాయతీ కార్యదర్శిని అకారణంగా విధుల్లోంచి తొలగించారని నిరసిస్తూ.. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు. జులై 27న ఉదయం కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాత్రి తొమ్మిదైనా.. నిరసన విరమించలేదు. అధికారులు హామీ ఇచ్చినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు.
విధుల్లోంచి తొలగించిన మోహన్ రావు పేట పంచాయతీ కార్యదర్శిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని.. భీష్మించుకొని కూర్చున్నారు. జోక్యం చేసుకున్న జగిత్యాల పట్టణ పోలీసులు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏ తప్పు చేయకున్నా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని.. పల్లె ప్రగతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ పల్లెల అభివృద్ధికి పాటు పడుతుంటే పంచాయతీ కార్యదర్శులను వేధింపులకు గురి చేయడం సరికాదని, అధికారం ఉంది కదా అని అకారణంగా ఉద్యోగాలు తొలగిస్తున్నారని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'