నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్నఉద్యోగుల వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏనుగు మల్లారెడ్డి వ్యతిరేకించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ పాఠశాలలో నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో త్యాగాలు చేసిన నిరుద్యోగులకు అవకాశాలు కల్పించకపోవటంపై ఆవేదన వెలిబుచ్చారు.
ముఖ్యమంత్రి తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో యువత తప్పుదోవ పట్టే అవకాశముందని తెలిపారు. వయోపరిమితి పెంచినా తాను మాత్రం వచ్చే ఏడాది మార్చి నాటికి ఉద్యోగ విరమణ చేస్తానని ఆయన వెల్లడించారు. యువత భవిష్యత్తు కోసం ఉద్యోగులంతా వయోపరిమితి పెంపును వ్యతిరేకించాలని ఏనుగు మల్లారెడ్డి కోరారు.