Son died in an accident in Jagital : తండ్రి తన కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత బతుకుదెరువుకోసం.. ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ వెళ్లాడు. పదేళ్ల పాటు అక్కడే ఉన్నాడు. ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా ఇంటి ముఖం చూడలేదు. కుటుంబ వ్యవహారాలు, పిల్లల బాగోగులు ఫోన్లో మాట్లాడి తెలుసుకునేవాడు. నేరుగా ఎప్పుడు దగ్గరుండి పిల్లలకు తండ్రి ప్రేమను పంచలేకపోయాడు. అయ్యో నా పిల్లల దగ్గర ఉండలేక పోతున్నానే.. వారికి తండ్రి ప్రేమను పంచలేకపోతున్నానే అని అనుక్షణం మథన పడుతుండేవాడు. అలా పదేళ్లు గడిచిపోయింది.
Minor boy killed in an accident in Jagtial : చాలా కాలం నిరీక్షణ పూర్తయ్యాక ఇంటికి వెళ్లే సమయం వచ్చింది. ఎట్టకేలకు ఇంటికి బయలు దేరాడు. కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్కు వచ్చి ప్రేమతో ఇంటికి తీసుకెళ్లారు. ఇన్నాళ్ల తర్వాత కన్న పిల్లల్ని చూసుకుని ఎంత ఎదిగిపోయారని ప్రేమతో హత్తుకున్నాడు. తండ్రి వచ్చాడనే సంతోషంలో పిల్లలు, పిల్లల్ని చూశాననే ఆనందంలో తండ్రి ఇలా ఆనంద లోకంలో విహరిస్తుండగా ఆ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. కొన్ని గంటల్లోనే ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇంటికెళ్లిన తర్వాత తాగడానికి నీరు లేకపోవడంతో నీటి డబ్బా తీసుకొస్తానని బైక్పై వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలనకు వెళ్లిపోయాడు. విగతజీవిగా పడి ఉన్న కొడుకుని చూసి తండ్రి బోరున విలపిస్తూ కుప్పకూలిపోయాడు. ఈ మనసును కదిలించే.. హృదయాన్ని ద్రవింపజేసే ఘటన జగిత్యాలలో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన చౌట్‌పల్లి మోహన్, పద్మిని దంపతులకు కుమార్తె హర్ష, కుమారుడు శివకార్తిక్(12) ఉన్నారు. . శివకార్తిక్ జగిత్యాల పట్టణంలోనే ఐదో తరగతి చదువుతున్నాడు. తండ్రి మోహన్ ఉపాధి నిమిత్తం పదేళ్ల క్రితమే సౌదీ అరేబియా వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగి రావడంతో కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టుకు వెళ్లి తోడ్కొని వచ్చారు. ఇంట్లో తాగునీరు అయిపోవడంతో తాను తీసుకొస్తానని శివకార్తిక్ ద్విచక్రవాహనంపై వెళ్లాడు. బైపాస్ రహదారిలోని దేవిశ్రీ గార్డెన్ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పదేళ్ల తర్వాత తన కొడుకును చూసుకున్న ఆ తండ్రి ఆనందం అంతలోనే మాయమైపోయిందని స్థానికులు కూడా కంటతడి పెట్టారు.
ఇవీ చదవండి: