డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై కోరుట్ల పురపాలక సంఘం వివరణ ఇవ్వాలని భాజపా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. పేద ప్రజల మీద తెరాస సర్కార్ ఎల్ఆర్ఎస్ రూపంలో మోయలేని భారం నెట్టిందని కాషాయ దళ కౌన్సిలర్లు మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం భూ క్రమబద్ధీకరణ జీఓను రద్దు చేయాలని కౌన్సిలర్ మాడవేణి నరేశ్ గంగపుత్ర డిమాండ్ చేశారు.
కౌన్సిల్ రసాభసా..
ఈ క్రమంలో భాజపా, తెరాస కౌన్సిలర్ల మధ్య వాగ్వాదంతో సమావేశం రసాభసగా సాగింది. సమావేశం మధ్యలోనే భాజపా కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తూ సభను బాయికాట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
గుడికి దూరంగా తరలించాలి..
కోరుట్లలో సాయిరాం దేవాలయం గుడి దగ్గర మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని.. తక్షణమే గుడికి దూరంగా తరలించాలని నరేశ్ పట్టుబట్టారు. పురపాలిక పరిధిలోని వార్డుల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో సుమారు ఐదువేలకుపైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు పేదలు దరఖాస్తులు చేసుకుంటే 80 నివాసాలు కూడా పూర్తి కాలేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఇప్పటికీ జమకాలేదు..
18 నెలల క్రితమే పింఛన్‌కు అర్జీ పెట్టుకుంటే ఇప్పటికీ అర్హుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో భాజపా కౌన్సిలర్లు పెండం గణేష్, శీలం వేణుగోపాల్, విజయలక్ష్మి, మొలుమురి అలేఖ్య, మురళి, దాసరి రాజశేఖర్ సునీత పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఫీజు చెల్లించలేదని ఆన్‌లైన్ తరగతులు నిలిపివేయవద్దు : హైకోర్టు