కృష్ణా నదిలో ప్రవాహం స్వల్పంగా పెరిగింది. జూరాలకు ఎగువ నుంచి ప్రవాహం తగ్గగా.. గేట్లు సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. విద్యుత్తు ఉత్పత్తి, స్పిల్‌వే ద్వారా దిగువకు 73 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ 9.54 టీఎంసీలు ఉంది.
ఆలమట్టికి 50 వేల క్యూసెక్కులు వస్తుడడంతో దిగువకు 46 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నారాయణపుర్‌కు 45 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు అంతే మొత్తంలో వదిలేస్తున్నారు. శ్రీశైలం జలాశయం వద్ద ప్రవాహంలో పెద్దగా మార్పులు లేవు. మరోవైపు గోదావరి పరీవాహకంలో ప్రాణహిత నుంచి వరద కొనసాగుతోంది.
జూరాలలో 429 మెగావాట్ల విద్యుదుత్పత్తి
జూరాల ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో వరద నీటితో ఉత్పత్తి కొనసాగుతోంది. మొత్తం 11 యూనిట్ల నుంచి 429 మెగావాట్ల ఉత్పత్తి వస్తున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో..
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్నందున జల విద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉత్పత్తి ప్రారంభించారు.
అర్ధరాత్రి 12 గంటల వరకు 1.26 టీఎంసీల నీటిని దిగువ ప్రాంతానికి వదలడం ద్వారా 6.87 మిలియన్ యూనిట్ల విద్యుద్ ఉత్పత్తి సాధించినట్లు ఎస్‌ఈ దేశ్యానాయక్ తెలిపారు. ప్రస్తుతానికి కేంద్రంలోని ఆరు యూనిట్ల ద్వారా విద్యుద్ ఉత్పత్తి కొనసాగుతుందని చెప్పారు.
ఇదీ చూడండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్