ఎంత పెద్ద రోగమొచ్చినా.. కుటుంబ సభ్యులు, బంధువులు మేమున్నామంటూ ముందుకొచ్చి రోగికి సపర్యలు చేస్తూ ధైర్యం చెప్పేవారు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు మామూలు జ్వరమొచ్చినా ముట్టుకోవడానికి జంకుతున్నారు. కొవిడ్ సోకిందేమో అన్న అనుమానంతో బాధితుడు చనిపోయినా పట్టించుకోవడం లేదు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్డుకు చెందిన రవీందర్ అనే వ్యక్తి గతకొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ మరణించాడు. కరోనాతో చనిపోయాడేమో అనుకొని ఎవ్వరూ ముట్టుకోలేదు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదు. మృతుడి తరపు బంధువులు ఉన్నప్పటికీ వారు కూడా స్పందించలేదు.
పట్టణానికి చెందిన కొంతమంది మైనార్టీ యువకులు మృతుడికి అంత్యక్రియలు చేయడానికి ముందుకొచ్చారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. రబి, మునీర్, ఇషాక్ అలీ, ఇమ్రాన్లు కలిసి పీపీఈ కిట్లు ధరించి అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంలో ఏ మతానికి చెందిన వారు మృతి చెందినా ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని వారు తెలిపారు. మానవత్వంతో స్పందించి ఓ అభాగ్యుడి అంత్యక్రియలు నిర్వహించిన యువకులను అందరూ అభినందిస్తున్నారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ