తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం తెరుచుకుంది. రెండున్నర నెలల తర్వాత ఆలయం తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో అంజన్నను దర్శనం చేసుకోడానికి భక్తులు ఉదయం నుంచే క్యూ కట్టారు. తొలిరోజు ఆలయ అర్చకులు ఆలయాన్ని శుభ్రం చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం కోసం వచ్చే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కు ధరిస్తేనే ఆలయంలోని అనుమతిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులకు ఆలయంలోకి ప్రవేశం రద్దు చేసినట్టు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. ఉదయం ఏడున్నర నుంచి.. సాయంత్రం నాలుగున్నర వరకు దర్శనానికి అనుమతి ఇస్తారు. స్వామివారి అభిషేకాలు, అర్చనలు, వాహన పూజలు, వ్రతాలు, శావ తదితర అర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. భక్తులకు వసతి గృహాలు ఇవ్వమని, ప్రైవేటు అద్దె గదులకు కూడా అనుమతి లేదని తెలిపారు. తలనీలాలు అర్పించడం కూడా రద్దు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. కేవలం సాధారణ దర్శనం మాత్రమే ఉంటుందని.. అది కూడా భక్తులు భౌతిక దూరం పాటిస్తేనే అనుమతిస్తున్నారు.
ఇదీ చూడండి: 80 రోజుల తర్వాత పెట్రోల్ ధరలు పెంపు