జగిత్యాల జిల్లా ధర్మపురిలోని పలు వీధులు ఇప్పటికీ బురదలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో గోదావరి తీరప్రాంతంలో కనిపించిన చిరు దుకాణాలు అయితే.. పూర్తిగా నీళ్లలో కొట్టుకుపోయాయి. కడెం ప్రాజెక్టు నుంచి ఉద్ధృతంగా వచ్చిన వరద.. గోదావరి నీటితో పాటు అక్కపల్లి చెరువు నుంచి వచ్చిన ప్రవాహం.. ధర్మపురిలోని తెనుగు వాడ, గంపలవాడ, కుమ్మరివాడ, బ్రాహ్మణవాడలను ఉక్కిరి బిక్కిరి చేసింది. అధికారిక లెక్కల ప్రకారం 392 ఇళ్లు దాదాపు రెండు రోజుల పాటు పూర్తిగా నీళ్లలోనే ఉండిపోయాయి. ఇందులో అధిక శాతం కచ్చా ఇళ్లే ఉండటంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 172 ఇళ్లు పాక్షికంగానూ.. 18 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. రెండు రోజుల తర్వాత నీళ్లు వెళ్లిపోయాక.. ఇళ్లకు వచ్చిన వారికి కన్నీరే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరద ఉద్ధృతి అధికంగా ఉన్న రెండు రోజుల పాటు.. తినడానికి ఆహారం సరఫరా చేశారు. ప్రస్తుతం పరిస్థితి దయనీయంగా మారిందని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లతో పాటు ఇంట్లో సామగ్రి మొత్తం కొట్టుకుపోగా.. కట్టుబట్టలతో మిగిలిన తమకు సర్కార్ నుంచి అందే సాయంపై పెదవి విరుస్తున్నారు. కచ్చా ఇంటికి రూ.3,200.. పక్కా ఇళ్లు దెబ్బతిన్న వాళ్లకు రూ.5,200 ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో బాధితులు బోరుమంటున్నారు.
పునరుద్ధరణ చర్యలు..: మరోవైపు ఏకదాటి వర్షాల సందర్భంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదన్న ప్రధాన లక్ష్యంతో.. పని చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సర్కార్ ఎంత సాయం చేసినా.. తాము ఎన్ని రకాలుగా యత్నించినా.. తాము కుదుటపడటానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని బాధితుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది.
ఇవీ చూడండి..
శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల.. ఆరుబయట పాఠాలు
20 ప్రశ్నలు వేసిన ఈడీ.. సోనియా స్పెషల్ రిక్వెస్ట్.. గంట లంచ్ బ్రేక్