జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు చెరుకు రైతులు ఆందోళన బాటపట్టారు. మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన అన్నదాతలు మెట్‌పల్లి మండలం మారుతీనగర్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అన్నదాతల ఆందోళనతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించి.. ధర్నా విరమింపజేశారు. రాకపోకలను పునరుద్ధరించారు.