రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి జిల్లాలో కనీసం 200-300 మంది ఉపాధ్యాయులు ఒక పాఠశాల నుంచి మరో చోటకు డిప్యుటేషన్‌పై వెళ్లనున్నారు. దాదాపు 8 వేల మంది ఇతర పాఠశాలలకు తాత్కాలిక బదిలీ మీద వెళ్తారు.
కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు మంగళవారమే రిలీవ్ కావాలని డీఈఓలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా ఒక్క విద్యార్థి లేని పాఠశాలల్లోని ఉపాధ్యాయులను అదే మండలంలో మరో చోటకు బదిలీ చేస్తుంటారు. ఈసారి తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఎక్కువ మంది పిల్లలున్న పాఠశాలల్లోకి డిప్యుటేషన్‌పై పంపిస్తున్నారు.
అత్యధికంగా ప్రాథమికోన్నత పాఠశాలల(యూపీఎస్) నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్‌జీటీ)లను ఇతర ప్రాథమిక పాఠశాలలకు, 6, 7, 8 తరగతులకు బోధించే సబ్జెక్టు టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లనూ సమీపంలోని ఉన్నత పాఠశాలలకు బదిలి చేస్తున్నారు. రాష్ట్రంలో 3,200 ప్రాథమికోన్నత పాఠశాలలు తక్కువ మంది విద్యార్థులతో కొనసాగుతున్నాయి. వాటిల్లో 6, 7 తరగతులకు కలిపి 10 మందిలోపు విద్యర్థులు ఉన్నవి 1400 వరకు ఉన్నాయి. ఆ రెండు తరగతులు కలిపి ఒక్కరూ లేనివి 350 వరకు ఉన్నాయి.
ఈ క్రమంలో అక్కడి నుంచి ఉపాధ్యాయులను ఇతర చోట్లకు డిప్యుటేషన్‌పై పంపిస్తున్నారు. ఫలితంగా అత్యధికంగా యూపీఎస్‌ల్లోని 6, 7 తరగతులు బోధించే ఉపాధ్యాయులపైనే ప్రభావం పడుతుంది. ‘ప్రైవేట్ పాఠశాలల నుంచి భారీగా విద్యార్థులు వచ్చి చేరుతున్నందున ఎస్‌జీటీలను ఉన్నత పాఠశాలలకు డిప్యుటేషన్లపై పంపడం సరైంది కాదు’ అని ఎస్‌జీటీ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు ఖామ్రోద్దీన్ తెలిపారు.
ఇదీ చదవండి: CM KCR: దశల వారీగా రాష్ట్రమంతా దళితబంధు.. ఏటా బడ్జెట్లో కేటాయింపులు