Kondagattu Small Hanuman Jayanthi Celebrations Starts Tomorrow: జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఆలయాల్లో ఒకటైన కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తుల రాక పెరిగిపోతోంది. గత నెలలో సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి రావటంతో మరింత ప్రధాన్యత సంతరించుకుంది. దీనికి తోడు మంగళవారం (ఏప్రిల్ 4వ తేదీ) నుంచి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి.
ఉత్సవాలు ప్రారంభం కావటంతో ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి.. అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా సరిగ్గా ఉత్సవాలు నిర్వహించకపోవడంతో.. భారీ స్థాయిలో హనుమాన్ దీక్ష పరులు కొండపైకి చేరుకొని మాల విరమణ చేయనున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు 3 లక్షల మంది భక్తులు ఈ నాలుగు రోజుల్లో వచ్చి హనుమాన్ దీక్షా విరమణ చేస్తారని అంచనా.
Kondagattu Hanuman Jayanthi Celebrations Starts: ఇందుకోసం జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ.. 15 వందల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం వారికి ఎటువంటి ఇబ్బంది తలేత్తకుండా చలవ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా పారిశుధ్య సిబ్బందిని కూడా కేటాయించారు. ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు.
చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా మూడు రోజులు ఈ ఉత్సవాలు బాగా జరుగుతాయి. డైలీ ఇక్కడికీ 30 నుంచి 40 వేల మంది దర్శనాలు చేసుకుంటారు. ఈ మూడు రోజులు స్వామి వారికి నిత్య అభిషేకం జరుగుతుంటది. దానిలో ప్రధాన పూజారులు ముగ్గురు పాల్గొంటారు. ప్రతి రోజు అభిషేకాలు జరుగుతాయి. మాల విరమణలు కూడా జరుగుతాయి. -పూజారి, కొండగట్టు
వచ్చే భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి, మొక్కులు తీర్చుకోవడానికి నీళ్లను నింపారు. ఆలయంలో చుట్టూ బారికేడ్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. గతంలో చూస్తే కాస్త ఏర్పాట్లు మెరుగ్గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరుగుదొడ్ల సౌకార్యం, కొండపైకి చేరే విధంగా రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.
ఇక్కడికీ మేము ఐదారు సార్లు వచ్చాం. అప్పటికీ, ఇప్పటికీ కొంచెం మెరుగు పరుస్తున్నారు. సౌకర్యాలైతే వచ్చిన భక్తుల కోసం పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కోతుల బెడద ఇక్కడ ఎక్కువగా ఉంది. ఆ కోతులను ఎప్పుడు తరలిస్తారో అప్పుడు ఇక్కడ సౌకర్యాలు కనపడతాయి -భక్తులు
ప్రపంచాన్నే ఆకర్షించే ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలి: గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయాన్ని దివ్యక్షేత్రంగా రూపుదిద్దే క్రతువులో భాగంగా రూ.100 కోట్ల ప్రకటించామని.. మరో రూ.500 కోట్లు (మొత్తం రూ.600 కోట్లు) కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం విధితమే. దేశంలోనే ప్రముఖ హనుమాన్ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కొండగట్టు ప్రపంచాన్నే ఆకర్షించే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నారు. అంజన్న దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని చెప్పారు.
ఇవీ చదవండి: