Yuga Thulasi foundation protest: గోరక్షకులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని శివకుమార్ ఆరోపించారు. ఇప్పటి వరకు గోవులను తరలించే ఒక్క వాహనమైనా పోలీసులు పట్టుకున్నారా అని ప్రశ్నించారు. గో మాత కొమ్ములను విరగొట్టి అత్యంత దారుణంగా వాహనాలలో తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆధారాలతో సహా పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.
కర్మన్‌ఘాట్‌లో జరిగిన ఘటనలో దాడి చేసిన దుండగులను వదిలేసి.. గో రక్షకులపై కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బేషరతుగా వారిపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. రేపు తలపెట్టిన గోరక్షా ధర్నాకు పోలీసులు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదన్నారు. పోలీసులు ఎన్ని అడ్డుకులు సృష్టించినా ధర్నా చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
గోడపత్రిక ఆవిష్కరణ
గో చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్ డిమాండ్ చేశారు. గోమాత అక్రమ రవాణాను అడ్డుకుంటున్న తమను పోలీసులు నిలువరించడం సరికాదన్నారు. గో రక్షకులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈనెల 26న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద గో రక్ష ధర్నాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ధర్నాకు సంబంధించిన గోడపత్రికను ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ఆవిష్కరించారు.
'గోవులను అత్యంత దారుణంగా వాహనాల్లో తరలిస్తుంటే మేం అడ్డుకున్నాం. గో మాతల కొమ్ములు విరగ్గొట్టి, కాళ్లు, చేతులు కట్టేసి వాహనాల్లో తరలిస్తున్నారు. ఇంత దారుణంగా గోవులను హింసిస్తుంటే పోలీసుల మమ్మల్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు. దీనిపై మేం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. గోవులను రక్షించేందుకు శాంతియుతంగా పోరాడుతున్నాం. ఈ ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికైనా గోమాత చట్టాలను కఠినంగా అమలు చేయాలి. బీఫ్ షాపులు, స్లాటర్ హౌస్‌లు మూసివేయాలి. గో హంతకులను కఠినంగా శిక్షించాలి.' - శివ కుమార్, యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్