YS Sharmila Padayatra: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన వైఎస్‌ఆర్టీపీ అధక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర మరో పదిరోజుల్లో తిరిగి ప్రారంభిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత తూడి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంతమంది పార్టీకి ఈ పేరు రాకుండా చేయాలని ప్రయత్నించారన్నారు.
కానీ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోగలిగామని తెలిపారు. పార్టీ పునః నిర్మాణంలో భాగంగా జిల్లాలకు, మండలాలకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని పేర్కొన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.. కాబట్టి వీలైనంత త్వరగా పార్టీ జిల్లా, మండల కార్యవర్గాలను పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల భర్తీ చేస్తారన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయిన సందర్భంగా అన్ని జిల్లాలు, మండలాల్లో, నియోజక వర్గాల్లో వేడుకలు కొనసాగుతాయన్నారు.
గతేడాది అక్టోబర్ 20న ప్రారంభం..
రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు 14 పార్లమెంట్ నియెజకవర్గాల్లో 400రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పరిధి లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 20న వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన తండ్రి వైఎస్ఆర్ చూపిన బాటలోనే తాను నడుస్తున్నానని ప్రజల సంక్షేమం పట్టని సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యమని పాదయాత్ర ప్రారంభంలో ఆమె అన్నారు.
ఇదీ చూడండి: YS Sharmila Padayatra: 'దమ్ముంటే నాతో పాదయాత్రకు రండి'