YS Sharmila Comments on KCR: సీఎం కేసీఆర్.. బంగారు భారత్ ప్రకటనపై వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రలో ఎలా కలుపుతారని.. అది సాధ్యమా? అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు విలీనంపై కేటీఆర్ మాట్లాడారని షర్మిల విమర్శించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
అందరికీ వర్తింపజేయాలి
59 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తింపచేయడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 66 లక్షల మంది అన్నదాతలు ఉంటే 41 లక్షల మందికే పథకం అమలవుతోందని ఆరోపించారు. 59 ఏళ్ల లోపే రైతులు చనిపోవాలని ప్రభుత్వం భావిస్తోందా? అని నిలదీసిన షర్మిల.. రైతుబీమాను రూ. 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. వైతెపా కార్యాలయం వద్ద షర్మిల ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
"బంగారు తెలంగాణ కాదు... ఇది బానిసత్వపు తెలంగాణ. తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు, అది సాధ్యమా.? ప్రజలను రెచ్చగొట్టేందుకు కేటీఆర్ విలీనం గురించి మాట్లాడారు. బంగారు తెలంగాణ కాదు... ఇది బానిసత్వపు తెలంగాణ. 59 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తించట్లేదు. ఎల్ఐసీలో 70 ఏళ్లు పైబడిన వారికీ పాలసీలు ఉన్నాయి. రైతులందరికీ బీమా వర్తింపజేయాలని హైకోర్టును ఆశ్రయించాం. 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది." -వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రకాశ్‌రాజ్‌కు రాజ్యసభ సీటు?