Young people are ruining their lives with petty cases: సినిమాల ప్రభావమో, వయసు తెచ్చిన ఆవేశమో కారణమేదైనా కావచ్చు చిన్నచిన్న విషయాలకే యువకులు ఘర్షణలకు దిగుతున్నారు. కారు కిరాయి అడిగినందుకు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 17 మంది యువకులు కలిసి డ్రైవర్‌ను కొట్టారు. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డుమీద పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న 20 మంది యువకులు దారిన వెళుతున్న ఇద్దరిపై దాడి చేశారు. ఈ రెండు కేసుల్లోనూ విద్యార్థులు, చిరుద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి.
ఒక్కసారి పోలీస్ కేసు నమోదైతే ఆ తర్వాత ప్రతి పనికీ ఏదోవిధంగా ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది. ఇలాంటి పనులు వారి కెరీర్‌ను దెబ్బతీస్తాయి. ఒక్క పోలీసు కేసు నమోదైనా భవిష్యత్తులో ఉద్యోగమే కాదు పాస్‌పోర్టు పొందడం కూడా కష్టమే. ఈ మధ్యకాలంలో పాస్‌పోర్టు దరఖాస్తుల్లో తిరస్కరిస్తున్న వాటి సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. తమపై ఎలాంటి కేసులు లేవని చెప్పే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు తెచ్చుకొమ్మని ఇటీవల పలు ప్రైవేటు సంస్థలు అభ్యర్థుల్ని అడుగుతున్నాయి. ఇవి ఉన్న వారినే ఉద్యోగాలకు అనుమతిస్తున్నాయి.
ఎక్కడ నమోదైనా దాచలేరు:
ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా దాదాపు లక్ష మంది పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేస్తుంటారు. వీరందరి వివరాలను స్పెషల్ బ్రాంచి పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తారు. అన్ని విషయాలు ఆరా తీశాకే, పోలీసు కేసులు ఏవీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే పాస్‌పోర్టు పొందేందుకు అర్హత వస్తుంది. వారిపై ఎక్కడ కేసులు నమోదైనా ఇప్పుడు అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌తో బయటపడిపోతాయి. పోలీసులు పరిశీలిస్తున్న పాస్‌పోర్టు దరఖాస్తుల్ని గమనిస్తే అందులో రెండు నుంచి మూడుశాతం చిన్నచిన్న కేసులు ఇతరత్రా ఉల్లంఘనల వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి.
గత ఏడాది 41 వేలకుపైగా పెట్టీ కేసులు:
చిన్నచిన్న తగవులు, కొట్లాటలు, ఉల్లంఘనలకు సంబంధించి కూడా పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసి మరీ నమోదైన కేసులను పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది 41 వేలకుపైగా పెట్టీ కేసులు నమోదైతే వాటిలో 33 వేలకుపైగా కేసుల్లో ఏదో విధమైన శిక్ష పడింది. కొందరికి జరిమానా విధిస్తే ఇంకొందరికి న్యాయస్థానం ఐదారు రోజుల జైలుశిక్ష విధించింది. ఇదంతా పోలీసు రికార్డుల్లో ఉంటుంది.
కేసు కొట్టేసినా వెల్లడించాల్సిందే:
ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన తర్వాత వారిపై పోలీసు కేసులు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలిస్తారు. నిఘా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు ఆ ఉద్యోగి వివరాలు పంపించి, అక్కడ ఏమైనా కేసులు ఉన్నాయేమో పరిశీలించి మరీ సంబంధిత శాఖకు నివేదిక ఇస్తారు. కేసులు ఉండే పక్షంలో దాని తీవ్రతను బట్టి ఉద్యోగం చిక్కుల్లో పడినట్లే. తమపై కేసు నమోదైనా కొట్టేశారన్న ఉద్దేశంతో పోలీసు ఎంపికలప్పుడు కొందరు అభ్యర్థులు ఆ విషయాన్ని దరఖాస్తులో పేర్కొనడం లేదు.
కేసు కొట్టేసినప్పటికీ ఆ విషయాన్ని దరఖాస్తులో పేర్కొనాలన్న నిబంధన పాటించట్లేదు. ప్రతి సారీ పోలీసు ఎంపికల్లో ఇలాంటి వారు 25 మంది వరకూ ఉంటున్నారు. దీన్నిబట్టి పోలీసు కేసు ఎంత నష్టం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే చిన్న గొడవే కదా అనుకున్నా.. అప్పటికప్పుడు అరెస్టు కాకుండా తప్పించుకున్నా అది జీవితాంతం వెంటాడుతుందని యువత గుర్తించాలి. కాబట్టి భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని గొడవలు, కొట్లాటలకు వెళ్లకపోవడం అన్నిరకాలుగా మంచిది అన్న విషయం గ్రహించాలి.
ఇవీ చదవండి: